old couple applied for Compassionate death: కలసి బతికిన మేము.. కలిసే చనిపోవాలనుకుంటున్నాం!: కారుణ్య మరణానికి అనుమతివ్వమంటూ రాష్ట్రపతికి దంపతుల లేఖ!
- ఒకరు చనిపోతే.. మరొకరం బతకలేం
- కారుణ్య మరణం ప్రసాదించండి
- చనిపోయే హక్కును కూడా రాజ్యాంగం కల్పించింది
మూడు ముళ్ల బంధంతో ఏకమైన వీరిద్దరూ.. తమ మధ్య మూడో వ్యక్తి వద్దనుకున్నారు. తమ అన్యోన్య దాంపత్యానికి ఎవరూ అడ్డు కాకూడదని భావించారు. తుది శ్వాస వరకు తోడునీడగా బతకాలని నిర్ణయించారు. ఇప్పుడు కలసి చనిపోవాలని కోరుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే, ముంబైలో నివాసం ఉంటున్న నారాయణ్ (86) మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 30 ఏళ్ల పాటు విధులను నిర్వహించి, ఉద్యోగ విరమణ చేశారు. అతని భార్య ఐరావతి (79) ఓ ప్రముఖ విద్యా సంస్థలో ప్రిన్సిపల్ గా పని చేశారు.
పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు వద్దనుకున్నారు వీరు. ముసలితనంలో మరొక్కరిపై ఆధారపడకూడదనే ఉద్దేశంతోనే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు జీవితం చరమాంకంలోకి వచ్చేశారు. దీంతో, అనారోగ్య కారణాలతో ఇద్దరిలో ఎవరైనా ముందే చనిపోతే, ఇంకొకరు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందనే ఆవేదనలో ఉన్నారు. అంతేకాదు, తాము సమాజానికి ఇబ్బందిగా మారకూడదని భావిస్తున్నారు. దీంతో, తామిద్దరం కలసి చనిపోయేందుకు, కారుణ్య మరణానికి అనుమతించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు.
ఏ వ్యక్తి అయినా అనారోగ్యం కారణంగా బతకడానికి ఇబ్బంది పడుతుంటే కారుణ్య మరణానికి కొన్ని దేశాలలో అనుమతిస్తున్నప్పటికీ, మన దేశంలో మాత్రం అనుమతి లేదు. అయినా కూడా ఈ వృద్ధ దంపతులు... తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు. ప్రస్తుతం ఆయన సమాధానం కోసం వేచి చూస్తున్నారు. బతకడానికి క్షమాభిక్షను ప్రసాదించే రాజ్యాంగం... చనిపోయేందుకు కూడా హక్కును కల్పించిందంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో వారు పేర్కొన్నారు. వీరి విషయంలో రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.