america: అందుకే, అమెరికా అగ్రదేశం అయింది!: సీఎం చంద్రబాబు
- అమెరికాలో వందల ఏళ్లుగా వ్యూహాత్మక ప్రణాళిక
- ఆర్థిక సంస్కరణల కారణంగానే చైనా అగ్రగామి
- కేవలం 40 ఏళ్లలోనే జపాన్, కొరియా, సింగపూర్ ఆర్థికాభివృద్ధి
- భారత్‌లో వనరులు, యువ జనాభా, అత్యున్నత సాంకేతికత ఉన్నాయి
వందల ఏళ్లుగా వ్యూహాత్మక ప్రణాళిక వల్లే అమెరికా అగ్రదేశంగా ఆవిర్భవించిందని, ఆర్థిక సంస్కరణల కారణంగానే చైనా అగ్రగామి అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు జన్మభూమి నిర్వహణపై నోడల్ అధికారులు, జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం 40 ఏళ్లలోనే జపాన్, కొరియా, సింగపూర్ దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించాయన్నారు. పుష్కలమైన వనరులు, యువ జనాభా, అత్యున్నత సాంకేతికత ఉన్న భారతదేశం సరైన ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తే అమెరికా, చైనాలకు దీటుగా రూపాంతరం చెందుతుందని అన్నారు.
‘ఈ జన్మభూమి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రజల్లో విశ్వాసం పెంచింది. సంతృప్తిని ఇచ్చింది. శాశ్వతమైన, మెరుగైన జీవన ప్రమాణాలకు ఈ జన్మభూమి నాంది పలికింది ’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత మూడున్నరేళ్లుగా అభివృద్ధిపై, ఆర్థిక అసమానతల తగ్గింపుపై దృష్టి పెట్టామని, అందుకోసం స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేశామని తెలిపారు. పేదరిక నిర్మూలనకే సమాజ వికాసం, కుటుంబ వికాసం తెచ్చామని ముఖ్యమంత్రి అన్నారు.
‘జన్మభూమి నిర్వహణపై గ్రామాలు, వార్డులకు గ్రేడింగ్ లు ఇవ్వాలి. బెస్ట్ విలేజ్, బెస్ట్ వార్డు, బెస్ట్ మండల్, బెస్ట్ మున్సిపాలిటి, బెస్ట్ కార్పొరేషన్ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. నెలకోసారి విద్యార్థులు గ్రామాలను సందర్శించాలి, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.