spider: సాలీడును చంపబోయి ఇల్లు తగలబెట్టుకున్నాడు!
- టార్చ్ లైటర్‌తో సాలీడును చంపబోయిన అమెరికన్
- కాలిఫోర్నియాలో అపార్ట్మెంట్ దగ్ధం
- 11వేల డాలర్ల ఆస్తి నష్టం
కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించిన సాలీడును టార్చ్ లైటర్ సహాయంతో చంపబోయాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన ఇల్లుకు నిప్పంటుకోవడంతో 11వేల డాలర్ల నష్టం సంభవించింది. తన అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం కారణంగా ఆ చుట్టుపక్కల నివసించేవారు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి దాదాపు రెండు గంటల పాటు కష్టపడి మంటలను ఆర్పారు.
సాలీడును చంపబోయే ప్రయత్నంలో టార్చ్ లైటర్‌ను ఉపయోగించడం వల్ల సాలీడుకి నిప్పు అంటుకుంది. ఆ సాలీడు బెడ్ కిందకి వెళ్లడంతో పరుపుకి నిప్పంటుకోవడం వల్ల త్వరగా మంటలు వ్యాపించాయని ఆ అపార్ట్మెంట్లో నివాసముండే లిండ్సే వైస్గార్వర్ తెలిపారు. మంటలు ఆర్పడం కన్నా అవి పక్క అపార్టుమెంట్లకు పాకకుండా ఉండేందుకే తాము ఎక్కువగా కష్టపడాల్సి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు స్పష్టం చేశారు.