jayalalitha: జయలలిత పేరును నోబెల్ బహుమతికి సిఫారసు చేయాలి: తమిళనాడు డిప్యూటీ స్పీకర్
- ఆడశిశువుల హత్యల నివారణకి పథకం ప్రవేశపెట్టిన మాజీ సీఎం
- 1992లో 'క్రెడిల్ బేబీ స్కీమ్' ప్రవేశపెట్టిన జయలలిత
- మదర్ థెరెసా ప్రశంసలు అందుకున్న పథకమన్న డిప్యూటీ స్పీకర్
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత పేరును నోబెల్ బహుమతికి సిఫారసు చేయాలని అన్నాడీఎంకే సీనియర్ నేత, తమిళనాడు డిప్యూటీ స్పీకర్ వి. జయరామన్ అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై మాట్లాడుతూ ఆయన ఈ సూచనలు చేశారు. 1992లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆడశిశువుల హత్యల నివారణ కోసం `తొట్టిల్ కుళథైగల్ తిట్టం (క్రెడిల్ బేబీ స్కీమ్)`ను జయలలిత ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన ఆడశిశువులను వారి పెంపకం కోసం వారి తల్లులు వివరాలేమీ చెప్పకుండా ప్రభుత్వానికి అప్పగించవచ్చు.
మొదట సేలం పట్టణంలో ప్రారంభించిన ఈ పథకాన్ని ఆ తర్వాత రాష్ట్రం మొత్తానికి ఈ పథకాన్ని విస్తరించారు. దీంతో అక్కడి లింగ నిష్పత్తిలో గణనీయ పెరుగుదల కనిపించిందని జయరామన్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ పథకాన్ని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరెసా కూడా ప్రశంసించినట్లు ఆయన చెప్పారు.