aadhaar: ఆధార్‌కి ప్రత్యామ్నాయంగా తాత్కాలిక వర్చువల్ ఐడీ తీసుకురానున్న యూఐడీఏఐ
- వ్యక్తిగత వివరాలను వెల్లడించకుండా ఉండే సదుపాయం
- 16 అంకెల వర్చువల్ ఐడీతో ఆధార్ ఆధారిత సేవలు
- మార్చి చివర్లోగా అందుబాటులోకి తీసుకువచ్చే యోచన
ఆధార్ వివరాలు వెల్లడించకుండా అవసరమైన చోటల్లా ఆధార్‌ను ఉపయోగించుకునే సదుపాయాన్ని త్వరలో యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కల్పించబోతోంది. ఇందుకోసం ఓ తాత్కాలిక వర్చువల్ ఐడీని జారీ చేసే విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ 16 అంకెల తాత్కాలిక వర్చువల్ ఐడీ ద్వారా వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా ఆధార్ ఆధారిత సేవలను పొందే అవకాశం కలుగుతుంది. మార్చి నెలాఖరులోగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు యూఐడీఏఐ ప్రయత్నిస్తోంది.
ఈ వర్చువల్ ఐడీని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగదారుడు జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఐడీలో వినియోగదారుడి ఆధార్ వివరాలు ఉంటాయి. అవసరం తీరిపోయిన తర్వాత ఈ ఐడీ నిర్వీర్యమవుతుంది. ఆధార్ సర్వర్ హ్యాక్ అయిన కారణంగా దేశంలో ఉన్న అందరి వివరాలు తప్పుడు పనులకు ఉపయోగపడే అవకాశం ఉందని, ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛ మీద భరోసా ఇవ్వలేకపోతోందని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.