Telangana: 12వ తేదీ లోపు ‘రేయాన్స్’ కార్మికులకు ఒక నెల వేతనం చెల్లించాలి: డిప్యూటీ సీఎం కడియం ఆదేశాలు
- సంక్రాంతి పండగకు ముందే ఈ చెల్లింపులు జరగాలి
- ఫిబ్రవరి నెలలోపు ఫ్యాక్టరీ భవితవ్యాన్ని తేల్చాలి
- మూసివేయాలనుకుంటే కార్మికులకు అన్ని బకాయిలు చెల్లించాలి
- కడియం శ్రీహరి ఆదేశాలు
ఈ నెల 12వ తేదీలోపు భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ (బిల్ట్-బల్లాపూర్ ఇండస్ట్రీ లిమిటెడ్) కార్మికులకు ఒక నెల వేతనం చెల్లించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. సంక్రాంతి పండగకు ముందే ఈ చెల్లింపులు జరగాలని ‘రేయాన్స్’ సీఈవో నిహార్ అగర్వాల్ ను ఈ మేరకు ఆదేశించారు. కాగా, రేయాన్స్ ఫ్యాక్టరీ మూతపడడంతో గత 32 నెలలుగా తమకు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కంపెనీ తమ గోడు పట్టించుకోవడం లేదని ఈ కంపెనీ కార్మికులు మంత్రులకు ఇటీవల మొరపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కడియం శ్రీహరి అధ్యక్షతన హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గిరిజన శాఖ మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్ సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు.
ఫిబ్రవరి నెలలోపు ఫ్యాక్టరీ భవితవ్యాన్ని తేల్చాలని, ‘రేయాన్స్’ని పేపర్ పల్ప్ ఫ్యాక్టరీగా మార్చి నడిపించే ప్రతిపాదనలను పరిశీలించాలని కంపెనీ ప్రతినిధులకు మంత్రులు సూచించారు. లేనిపక్షంలో ఫ్యాక్టరీని మూసివేయాలనుకుంటే కార్మికులకు చెల్లించాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. ఈ విషయమై ఫిబ్రవరి 14 న కంపెనీ బోర్డ్ మీటింగ్ లో చర్చిస్తామని, ఈసారి తుది నిర్ణయం ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకోవాల్సి ఉంటుందని, తమ నిర్ణయాన్ని వాయిదా వేసేందుకు కుదరదని అన్నారు. ఈసారి ఫ్యాక్టరీ యాజమాన్యం తమ నిర్ణయాన్ని తీసుకోలేకపోతే...ప్రభుత్వం ఫ్యాక్టరీ మేనేజ్ మెంట్ పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఫిబ్రవరిలో కంపెనీ బోర్డు మీటింగ్ తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయాలపై చర్చించే నిమిత్తం మూడో వారంలో మరోసారి సచివాలయంలో సమావేశం కావాలని నిర్ణయించారు. వీలైనంత వరకు ఫ్యాక్టరీ నడిపించేలా యాజమాన్యాన్ని ఒప్పించి రావాలని కంపెనీ సీఈవో అగర్వాల్ కు మంత్రులు సూచించారు.