delhi: ఢిల్లీలో పోలీసులకు పట్టుబడ్డ లష్కరే తోయిబా ఉగ్రవాది
- ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఏటీఎస్-ఢిల్లీ పోలీస్ సంయుక్త ఆపరేషన్
- ఉగ్రవాది పేరు బిలాల్ అహ్మద్
ఢిల్లీ లో లష్కరే తోయిబా ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యాంటీ-టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్), ఢిల్లీ పోలీస్ సంయుక్తంగా ఈరోజు నిర్వహించిన ఆపరేషన్ లో వాంటెడ్ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం వద్ద ఆ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడ్డ ఉగ్రవాది పేరు బిలాల్ అహ్మద్ కావా. 2000 సంవత్సరంలో రెడ్ ఫోర్ట్ వద్ద ‘లష్కరే’ చేసిన దాడిలో బిలాల్ అహ్మద్ ఉన్నట్టు పోలీసుల సమాచారం. కాగా, ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకలు ఘనంగా నిర్వహించే నిమిత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి పలువురు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు ముమ్మరం చేశారు.