Donald Trump: భారత్ వంటి దేశాలతో కలసి పనిచేయడం మంచిదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- భారత్, రష్యా, చైనాలతో కలసి పనిచేయడం చెడ్డదేం కాదు
- ఉత్తర కొరియా సహా ఏ దేశంతోనైనా కలసి సాగేందుకు సిద్ధం
- ఉత్తర కొరియా విషయమై సానుకూల పరిణామాలకు అవకాశమని ప్రకటన
భారత్, రష్యా, చైనా తదితర దేశాలతో కలసి పనిచేయడం మంచిదేనని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇది చెడు మాత్రం కాదన్నారు. రష్యాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్న ట్రంప్ యత్నాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘‘రష్యా లేదా చైనా లేదా భారత్ లేదా ఈ ప్రపంచంలో మరే దేశంతోనయినా కలసి పనిచేయడం మంచిదే’’ అని నార్వే ప్రధాని ఎర్నాసోల్ బెర్గ్ తో కలసి వైట్ హౌస్ లో గురువారం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ అన్నారు.
అమెరికాకు బలమైన సైన్యం, ఎంతో చమురు, గ్యాస్, ఇంధన వనరులు ఉన్నాయన్న ఆయన, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఇది నచ్చదన్నారు. ఉత్తరకొరియాతోనూ కలసి పనిచేస్తే ఇంకా మంచిదని పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘ఉత్తరకొరియా విషయంలో చైనాతో కలసి పనిచేస్తున్నాం. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ తోనూ మాట్లాడాను. చాలా మంచి పరిణామాలు జరుగుతాయని ఆశిస్తున్నాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.