Salman Khan: సల్మాన్ ఖాన్‌పై దాడికి యత్నం..‘రేస్ 3’ సెట్స్ వద్ద తచ్చాడిన వ్యక్తులు!
- ముంబైలోని ఫిల్మ్ సిటీ లో ‘రేస్ 3’ షూటింగ్
- వెంటనే పోలీసులకు సమాచారం..షూటింగ్ నిలిపివేత
- ఎస్కార్ట్ తో సల్మాన్ తరలింపు
- గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ కు బెదిరింపులు
బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ పై కొందరు వ్యక్తులు దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. కృష్ణ జింకను వేటాడిన కేసులో నిందితుడిగా ఉన్న సల్మాన్ గత గురువారం జోథ్ పూర్ కోర్టుకు హాజరయ్యాడు. ఈ సందర్భంలోనే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. బిష్ణోయ్ కులస్తులు కృష్ణ జింకలను దైవంగా ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.
ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం, ‘రేస్ 3’ షూటింగ్ లో సల్మాన్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ముంబైలో ఫిల్మ్ సిటీలో మంగళవారం ఈ సినిమా షూటింగ్ జరిగింది. గుర్తుతెలియని సాయుధులైన వ్యక్తులు అక్కడ తచ్చాడారు. చిత్రయూనిట్ ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు షూటింగ్ ని తక్షణం నిలిపివేయాలని సల్మాన్ కి, చిత్ర నిర్మాత రమేష్ తౌరానికి చెప్పారు. వెంటనే అక్కడి నుంచి తమ నివాసాలకు వెళ్లిపోవాలని వాళ్లిద్దరికీ పోలీసులు సూచించారు.
దీంతో ఆరుగురు పోలీసుల రక్షణలో సల్మాన్ తన వాహనంలో ఇంటికి చేరుకున్నట్టు ఆ పత్రిక కథనం ఇచ్చింది. కాగా, ఈ విషయమై ముంబై పోలీసులు మాట్లాడుతూ, సల్మాన్ కు బెదిరింపులు రావడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నామని చెప్పారు.‘రేస్ 3’ సెట్స్ వద్ద మరింత భద్రత కల్పిస్తున్నట్టు చెప్పారు. ముగ్గురు వ్యక్తులు సల్మాన్ ని చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ లొకేషన్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నారని అన్నారు.