Balakrishna: ‘జై సింహా’ బాగుంటే రెవెన్యూ పరంగా పండగే పండగ.. ఆల్ ది బెస్ట్ : తమ్మారెడ్డి భరద్వాజ
- బాలయ్య సినిమాలన్నింటిలోకి ‘జై సింహా’ రికార్డు సృష్టిస్తుంది
- ఈ సినిమా బాగుండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి
- ఓ వీడియో పోస్ట్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ
‘అజ్ఞాతవాసి’ సినిమా మొదటి రోజు తాను అనుకున్నట్టుగానే అన్నిచోట్ల దాదాపు రికార్డులు సృష్టించిందని ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘అజ్ఞాతవాసి’ విడుదలకు ముందు రోజు ఓ వీడియో పోస్ట్ చేసిన ఆయన, ఆ సినిమా రికార్డు సృష్టిస్తుందని అనుకుంటున్నానని చెప్పడం తెలిసిందే. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘జై సింహా’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రం గురించీ తమ్మారెడ్డి ప్రస్తావిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
‘అమెరికాలో ‘అజ్ఞాతవాసి’ 2 మిలియన్లు లేదా 1.7 మిలియన్లు కలెక్షన్స్ చేసినట్టుంది. కలెక్షన్స్ విషయంలో ‘బాహుబలి-1’ ని ‘అజ్ఞాతవాసి’ క్రాస్ చేసింది కానీ, ‘బాహుబలి-2’ని అధిగమించలేకపోయింది. భారత్ లో కూడా ‘అజ్ఞాతవాసి’కి మొదటి రోజు మంచి రెవెన్యూ వచ్చింది. ‘అజ్ఞాతవాసి’కి రోజూ ఏడు షోలు, టికెట్ ధర పెంచుకునే అవకాశం ఇచ్చారు. మరి, ‘జై సింహా’కు కూడా అలా ఇస్తారో లేదో తెలియదు. ఒకవేళ అలా ఇస్తే, మొదటిరోజు మంచి రెవెన్యూని ఈ సినిమా కూడా వసూల్ చేస్తుంది.
ఒకవేళ, అలా ఇవ్వకపోయినప్పటికీ, సంక్రాంతికి విడుదలైన బాలయ్య సినిమాలన్నింటిలోకి ఈ సినిమా హయ్యస్ట్ రికార్డు సృష్టిస్తుందని నేను నమ్ముతున్నాను. ‘జై సింహా’ బాగుంటే రెవెన్యూ పరంగా పండగే పండగ. ఈ సినిమా గురించి రిపోర్టు బాగుంటే ఊహించని విధంగా రెవెన్యూ రాబడుతుంది. ఈ సినిమా బాగుండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో..ఆల్ ది బెస్ట్ ‘జైసింహా’ అని అన్నారు.