Telangana: సినిమా స్టైల్ లో రేవంత్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు!: ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా
- విద్యుత్ పై రేవంత్ తో చర్చిస్తే ఏం ఉపయోగం?
- ఆయనకు విశ్వసనీయత లేదు
- ఉత్తమ్,జానా, జీవన్, షబ్బీర్ చర్చకు రావాలి
- మీడియాతో ఎంపీ బాల్క సుమన్
విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం, ఈ విషయమై చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ సవాల్ విసరడం తెలిసిందే. అందుకు, రేవంత్ తిరిగి స్పందించడం విదితమే. ఈ అంశంపై చర్చించేందుకు ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తానని రేవంత్ నిన్న దీటుగా ప్రతిస్పందించారు.
ఈ విషయమై మీడియాతో బాల్క సుమన్ మాట్లాడుతూ, ఏమాత్రం విశ్వసనీయత లేని రేవంత్ రెడ్డితో చర్చిస్తే ఉపయోగం లేదని అన్నారు. విశ్వసనీయత ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదా సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 'మేము అడిగిన విషయాలపై వివరణ ఇవ్వని రేవంత్, అదేదో సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ‘నీ ఇంటికొస్తాం..నీ నట్టింటికి వస్తా’ అన్నట్టుగా సినిమా స్టైల్ లో ఓ ప్రెస్ నోట్ ని విడుదల చేశార'ని విమర్శించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. గాంధీభవన్ ని ‘గోబెల్స్ భవన్’ గా మార్చేశారని, పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, విద్యుత్ కు సంబంధించిన లెక్కలన్నీ స్పష్టంగా చూపించామని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేసిన వ్యాఖ్యల్లో ఎంత వాస్తవం ఉందో తెలంగాణ ప్రజల ముందు ఉంచడం జరిగిందని అన్నారు.