Chandrababu: ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు.. పలు అంశాలపై చర్చ
- విభజన హామీలపై చర్చ
- రెవెన్యూ లోటు, పోలవరం అంశాలను ప్రస్తావించిన బాబు
- దుగరాజపట్నంను ఆపివేయడంపై అభ్యంతరం
ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన హామీలను నెరవేర్చాలంటూ ప్రధానిని ఆయన గట్టిగా కోరారు. రాష్ట్రానికి దక్కాల్సిన అన్నింటినీ మోదీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు.
తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ. 16,078.76 కోట్లు ఉందని... కేంద్ర ప్రభుత్వం రూ. 7,500 కోట్లు ఇస్తామంటూ భరోసా ఇచ్చిందని, అయితే కేవలం రూ. 3,979 కోట్లు మాత్రమే ఇచ్చిందని ప్రధానికి తెలిపారు. మిగిలిన మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. విదేశీ ప్రాజెక్టుల ప్రతిపాదనల మొత్తం రూ. 18,857 కోట్లు అని... వీటిలో రూ. 8,349 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని, మిగిలిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలపాలని విన్నవించారు. నియోజకవర్గాలను పెంచాలని కోరారు.
ఈపీఏ ప్రాజెక్టును భరించే శక్తి రాష్ట్రానికి లేదని, ప్రత్యామ్నాయ వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రాసిన లేఖను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. నాబార్డు, హడ్కో నుంచి రుణాలను తీసుకునే వెసులుబాటు కల్పించాలని విన్నవించారు. ఎఫ్ఆర్బీఎం నుంచి తప్పించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 58,319.60 కోట్లు ఖర్చవుతుందనేది అంచనా అని... పునరావాసం కోసమే రూ. 33,858 కోట్లు అవసరమని, దీన్ని కేంద్రమే భరించాలని విన్నవించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. 11 జాతీయ విద్యా సంస్థల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దుగరాజపట్నం పోర్టును నిలిపివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.