sushma swaraj: విదేశీ ప్రయాణంలో కొడుకు మృతితో దిక్కుతోచని మహిళ.. సుష్మా స్వరాజ్ తక్షణ సాయం!
- మరోమారు తన ఉదారతను చాటుకున్న సుష్మ
- మలేషియా నుంచి కొడుకు మృతదేహాంతో పాటు తల్లి చెన్నైకు
- ఓ ట్వీట్ చేసిన సుష్మాస్వరాజ్
ఎవరైనా తమకు సాయం చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరితే.. ఆ వెంటనే స్పందించే విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. ఓ భారతీయ మహిళ తన కొడుకుతో కలిసి ఆస్ట్రేలియా నుంచి మన దేశానికి వస్తుండగా మార్గమధ్యంలో ఆమె కొడుకు చనిపోయాడు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ మహిళ పరిస్థితి దయనీయంగా ఉండటంతో ఆమెకు సుష్మ సాయం చేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఓ మహిళ ఆస్ట్రేలియా నుంచి భారత్ కు వస్తున్నారు. మార్గమధ్యంలో మలేషియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఆమె కొడుకు హఠాత్తుగా మరణించాడు. ఈ సంఘటనతో, ఏం చేయాలో ఆమెకు అర్థంకాలేదు. పైగా, అక్కడ ఆమెకు తెలిసిన వారెవ్వరూ లేరు. అయితే, మృతి చెందిన వ్యక్తి స్నేహితుడు ఒకరు వెంటనే స్పందిస్తూ ఈ విషయమై సుష్మాస్వరాజ్ కు ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు తక్షణం స్పందించిన సుష్మా స్వరాజ్, కౌలాలంపూర్ లోని భారత హైకమిషనర్ తో ఫోన్ లో మాట్లాడటంతో ప్రభుత్వ ఖర్చులతో అతని మృతదేహాన్ని, తల్లిని చెన్నైకి పంపించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న సుష్మ, మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు.