Hyderabad: పండుగ కోసం పల్లెకు తరలిపోయిన నగరం.. సొంతూళ్లకు 15 లక్షలమంది!

  • బోసిపోతున్న భాగ్యనగరం
  • పండుగ కోసం తరలిపోయిన పట్నం వాసులు
  • నేడు, రేపు మరో 5 లక్షలమంది వెళ్లే అవకాశం

సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నగరం పల్లెకు తరలిపోయింది. భాగ్యనగరం దాదాపు ఖాళీ అయింది. ఊళ్లకు వెళ్లే వారితో గత వారం రోజులుగా కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు శుక్రవారం జాతరను తలపించాయి. పండుగ సమయం దగ్గరపడడంతో ఇళ్లకు వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడుస్తున్న 3500 రెగ్యులర్ బస్సులకు అదనంగా మరో 3650 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. కొందరు పండుగ రద్దీని తట్టుకోలేక సొంత వాహనాలను ఆశ్రయించారు. గత నాలుగు రోజుల నుంచి ఇప్పటి వరకు 15 లక్షలమందికి పైగా పల్లె బాట పట్టారు. మరో ఐదు లక్షలమంది సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంది.

పండుగకు ఊరెళ్లే వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎన్నడూ లేనంత రద్దీగా మారింది. రైళ్ల కోసం గంటలతరబడి వేచి చూశారు. శుక్రవారం స్టేషన్ లోని ప్లాట్‌ఫాంలు అన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. రైలు కనిపిస్తే పరుగులు పెట్టారు. పండుగ రద్దీని తట్టుకునేందుకు అధికారులు ప్రకటించిన ప్రత్యేక రైళ్లు కూడా నిండిపోయాయి. సీటు కాదు కదా, ఏదో రకంగా రైలులోకి ఎక్కి నిలబడితే చాలు.. అన్న పరిస్థితి కనిపించింది.

శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైళ్లు అన్నీ దాదాపు గంట ఆలస్యంగా నడిచాయి. రెగ్యులర్ రైళ్లకు అదనంగా సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే మరో 50 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో టికెట్‌పై 50 శాతం అదనంగా వసూలు చేస్తుండగా, ప్రైవేటు ఆపరేటర్లు ఇదే అదునుగా దోపిడీకి తెరదీశారు. టికెట్‌పై మూడింతలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News