Andhra Pradesh: ఏపీలో సంచలనం.. రూ.23.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్!
- ఫైల్ క్లియరెన్స్ కోసం రూ.25 లక్షలు ఆఫర్ చేసిన కంపెనీ
- ఆఫీసులోనే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏడుకొండలు
- లంచం ఇచ్చిన వారూ ఏసీబీ అదుపులోనే..
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖకు చిక్కడం సంచలనంగా మారింది. రూ.23.20 లక్షలు లంచం తీసుకుంటుండగా రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమిషనర్ ఏడుకొండలును అవినీతి నిరోధకశాఖ అధికారులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. లంచం ఆఫర్ చేసిన కంపెనీ ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం..
మలేషియాకు చెందిన ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ గంగవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ, నౌకాశ్రయాల్లో బెర్త్‌ల నిర్మాణం చేపట్టింది. వీటి నిమిత్తం 2010 నుంచి 2014 వరకు వాణిజ్య పన్నుల శాఖ నుంచి రూ.4.67 కోట్లు రావాల్సి ఉంది. ఈ ఫైల్ ఏడుకొండలు వద్దకు వచ్చింది. ఐటీడీ కంపెనీ న్యాయ సలహాదారు అయిన గోపాల్‌శర్మకు ఏడుకొండలుతో పరిచయం ఉండడంతో పావులు కదిపారు. ఫైల్‌ను త్వరగా క్లియర్ చేస్తే రూ.25 లక్షలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య డీల్ కుదిరింది.
గోపాల్‌శర్మ, ఐటీడీ కంపెనీ డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణ కలిసి శుక్రవారం డబ్బులతో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. నగర శివారులోని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఏడుకొండలును కలిశారు. ఈ విషయంపై ముందే ఉప్పందడంతో మాటువేసిన ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.23.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఇంత పెద్దమొత్తంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి అని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. అలాగే లంచం పుచ్చుకున్న వారితోపాటు దానిని ఇచ్చినవారిని కూడా నిందితులుగా చేర్చడం కూడా ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు.