jayalalitha: జయలలితకు ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ రాసిన రహస్య లేఖ... శశికళ గదిలో లభ్యం!
- 2016, ఆగస్టు 11 తేదీతో లేఖ
- జయలలితకు రాసిన అప్పటి ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్
- చాలా మందికి ముడుపులు అందాయని ఆరోపణ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బతికి ఉన్న వేళ, ఆమెకు వచ్చిన ఓ సీక్రెట్ లెటర్ ఇప్పుడు బయటకు వచ్చింది. గత సంవత్సరంలో తాము శశికళ గదిలో సోదాలు జరిపిన వేళ, ఈ లేఖ తమకు దొరికిందని, దీనిలో కలకలం రేపిన గుట్కా స్కామ్ గురించిన వివరాలు ఉన్నాయని మద్రాస్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ సుసీ బాబు వర్గీస్ వెల్లడించారు.
గుట్కా స్కామ్ పై సీబీఐ దర్యాప్తును కోరుతూ డీఎంకే శాసనసభ్యుడు అంబజగన్ పిటిషన్ వేయగా, దీనిపై విచారించిన కోర్టు, వేదనిలయంలోని శశికళ గదులను సోదాలు చేసేందుకు అనుమతించింది. ఆ సోదాలలో ఈ లేఖ బయటపడింది. ఆగస్టు 11, 2016 తేదీతో ఈ లేఖ వుంది. ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ నుంచి సీఎం జయలలిత, డీజీపీలను ఉద్దేశిస్తూ అది వచ్చింది. ఈ స్కామ్ లో రాష్ట్ర మంత్రి, ఉన్నతాధికారులు, పోలీసులకు సంబంధమున్నట్టు తేలిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంతో సంబంధాలున్న రాజకీయ పార్టీలకు కూడా ముడుపులు అందాయని ఆరోపిస్తూ, వెంటనే స్పందించాలని, చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.