Bhogi: సంబరమంతా చిత్తూరుదే... ఐదు కిలోమీటర్ల దూరంలో ఓ వైపు చంద్రబాబు, మరో వైపు జగన్!
- నారావారి పల్లెలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్యామిలీస్
- అక్కడికి దగ్గరగానే వైకాపా అధినేత జగన్
- భోగి మంటలు వేసి సంక్రాంతికి ఆహ్వానం
చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నేతలు ఇరువురూ జిల్లాలో ఉండటం, అది కూడా ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉండి భోగి సంబరాల్లో పాల్గొంటుండటంతో తెలుగు సంబరమంతా అక్కడే ఉన్నట్లుంది. ఒకవైపు నారావారి పల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హీరో బాలకృష్ణ కుటుంబీకులు సంక్రాంతి వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడికి ఓ ఐదు కిలోమీటర్ల దూరంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్రలో భాగంగా బసచేసి వుండటం గమనార్హం.
ఈ ఉదయం జగన్ కూడా భోగి వేడుకల్లో పాల్గొని తనను అభినందించేందుకు వచ్చిన అభిమానులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం విలేజ్ టూరిజానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని, ఇటువంటి పండుగలను మరింత పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాగా, నారావారి పల్లెకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలోని పుల్లయ్యగారెల్ల గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే రోజా భోగి మంటలు వేసి ఆడి పాడారు. రేపు సంక్రాంతిని జరుపుకోనున్నామని, కనుమ రోజు రంగంపేట పరిసరాల్లో జల్లికట్టును వైభవంగా నిర్వహిస్తామని రోజా తెలిపారు.