Cock Fight: కోళ్ల కాళ్లకు కత్తులు కట్టేశారు... కోట్లల్లో సాగుతున్న కోడి పందేలు!
- సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు
- జోరుగా సాగుతున్న కోడి పందేలు
- దగ్గరుండి ఆడిస్తున్న ప్రజా ప్రతినిధులు
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు అయ్యాయి. పోలీసుల హెచ్చరికలు గాల్లో కలిసిపోయాయి. భోగి పర్వదినాన ఉభయ గోదావరి జిల్లాల్లో సంప్రదాయం పేరిట మొదలైన కోళ్ల పందేలు జోరుగా సాగుతుండగా, డిక్కీ పందేలు (కోళ్లకు కత్తులు కట్టకుండా సాగే పందేలు), ఇప్పుడు కత్తుల పందేలుగా మారిపోగా, నిమిషాల వ్యవధిలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని పాలకొల్లు, కాకినాడ, భీమవరం, వెంప, ఏలూరు, తాడేపల్లిగూడెం, గుడివాడ తదితర ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు సాగుతున్నాయి. ఈ ఉదయం ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అభయంతో తొలుత కత్తులు కట్టని పందేలను ప్రారంభించిన నిర్వాహకులు, ఆపై కత్తులు కట్టడం ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలవపూడిలో కత్తులు కట్టిన విషయం తెలుసుకున్న పోలీసులు, లాఠీ చార్జ్ చేసి అక్కడి పందెంరాయుళ్లను తరిమి కొట్టడంతో తాత్కాలికంగా పందేలు ఆగిపోయాయని తెలుస్తోంది. చాలా చోట్ల పోలీసులను మేనేజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.