turkey: రన్ వేపై అదుపు తప్పిన విమానం.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!
- టర్కీలో సంఘటన
- రన్ వేపై మంచుతో అదుపు తప్పిన బోయింగ్ 737-800
- సముద్రంలోకి దూసుకెళ్లి..కొండ అంచున ఉన్న మట్టిలో ఇరుక్కుపోయిన వైనం
నూట అరవై రెండు మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ విమానం రన్ వేపై నుంచి అదుపుతప్పి .. సమీపంలోని సముద్రం వైపు దూసుకెళ్లిన సంఘటన టర్కీలో జరిగింది. అక్కడి ట్రాబ్జాన్ ఎయిర్ పోర్ట్ నుంచి బోయింగ్ 737-800 విమానం బయలుదేరింది, ఆ వెంటనే, రన్ వే పై మంచు కారణంగా అదుపుతప్పిన విమానం సమీపంలో ఉన్న నల్ల సముద్రంలోకి దూసుకెళ్లింది.
అయితే, కొండ అంచున ఉన్న మట్టిలో ఆ విమానం ఇరుక్కుపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన ఎయిర్ పోర్ట్ అధికారులు.. ఆ విమానంలోని ప్రయాణికులను బయటకు దించేశారు. ముందుగా, మహిళలను, పిల్లల్ని జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు. అయితే, ఈ విమానం సముద్రంలోకి పడిపోతున్న సమయంలో ఎవరో తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారాయి.