India: 'మా పెళ్లి స్వర్గంలో జరిగింది... ఓసారి గొడవైనా ఏమీ కాదు':.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నెతన్యాహూ!
- దౌత్య బంధాన్ని బలపరచుకోవడమే లక్ష్యం
- ఇండియా పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని
- జరూసలేంకు వ్యతిరేకంగా ఐరాసలో భారత్ ఓటు
- అదేమీ సమస్య కాబోదన్న నెతన్యాహూ
ఇండియాతో మరింత బలమైన దౌత్య బంధాలను ఏర్పరచుకోవడమే లక్ష్యంగా పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఇండియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు, ఐరాసలో జరూసలేంకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేయడంపై స్పందించాలని 'ఇండియా టుడే' కోరగా, "మా పెళ్లి స్వర్గంలో జరిగింది. ఓ మారు విభేదాలు వచ్చినంత మాత్రాన ఏమీ కాదు. కొంత అసంతృప్తికి లోనైన మాట నిజమే అయినా, ఇరు దేశాలూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నదే నా అభిమతం" అని అన్నారు.
జరూసలేం విషయంలో భారత వైఖరిపై కొంత అసంతృప్తి ఉన్నా, రెండు దేశాల మధ్యా సంబంధాలపై ప్రభావం ఉండబోదని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ గొప్ప నేతని కితాబిచ్చారు. కాగా, టెక్నాలజీ, వ్యవసాయం తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్యా నేడు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉదయం ప్రధాని మోదీతో నెతన్యాహూ సమావేశం కానుండగా, ప్రతినిధుల స్థాయి సమావేశం జరగనుంది. ట్యాంకుల విధ్వంసక క్షిపణుల తయారీపై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి.