VH: పవన్ ఏం చూసి కేసీఆర్ ను పొగుడుతున్నాడు?: వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
- కేసీఆర్ ఆదర్శవంతుడని పొగిడిన పవన్ కల్యాణ్
- తీవ్రంగా తప్పుబట్టిన కాంగ్రెస్ నేత వీహెచ్
- కెల్విన్ ను తప్పించేందుకే కేసీఆర్ ను కలిసిన పవన్
- వీ హనుమంతరావు ఆరోపణలు
పవన్ కల్యాణ్ ఏం చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆదర్శవంతుడని పొగిడాడో వెల్లడించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, "తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను చూసి అడిగిండా?, ఏదీ నేరెళ్లలో జరిగిన ఇసుక మాఫియాను చూసి అడిగిండా? ఈనాడు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తానని మోసం చేసింది కనిపించిందా? లేకపోతే రైతుల రుణమాఫీ చూసిండా? ఏదీ చేయనోడిని ఆదర్శవంతుడని పొగడటమేంటి?" అని ప్రశ్నించారు.
వాస్తవం ఉంటే పొగడాలని, ఆయన ఇంద్రుడు, దేవుడంటే పవన్ కల్యాణ్ ను ఎలా నమ్మాలని అడిగారు. డ్రగ్స్ కేసులో చార్జిషీట్ లో ఇన్నిరోజులూ ఆగడమేంటని అడిగిన ఆయన, కెల్విన్ ను తప్పించేందుకే పవన్ వెళ్లి కేసీఆర్ ను కలిశారని ఆరోపించారు. ఈ కేసులో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారని సభర్వాల్ తనకు స్వయంగా చెప్పారని వీహెచ్ వ్యాఖ్యానించారు. తానేమీ పవన్ ను తిట్టలేదని, కేసీఆర్ దగ్గరకు ఎందుకు పోయావని మాత్రమే అడిగానని చెప్పారు. గతంలో పవన్ కల్యాణ్ ఎవడో నాకు తెల్వదని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు ఎలా పరిచయం ఏర్పడిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కెల్విన్ పై చార్జ్ షీట్ వేయలేదని, అందుకే తనకు అనుమానం వచ్చిందని చెప్పారు.