passport: చిరునామా తొలగింపు, ఆరంజ్ కలర్ పాస్ పోర్టులపై రాహుల్ గాంధీ ఫైర్
- ఈసీఆర్ పాస్ పోర్టులకు ఆరంజ్ కలర్
- 10వ తరగతి పాస్ కానివారికి ఈసీఆర్ పాస్ పోర్టులు
- రెండో శ్రేణి ప్రజల్లా చూస్తున్నారంటూ రాహుల్ మండిపాటు
పాస్ పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను తొలగించాలంటూ భారత విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇమ్మిగ్రేషన్ చెక్ కావాలనుకునేవారికి ఆరంజ్ కలర్ పాస్ పోర్టు ఇవ్వాలని నిర్ణయించింది. ఇమ్మిగ్రేషన్ చెక్ అవసరం లేని వారికి మాత్రం యథాతథంగా నీలం రంగు పాస్ పోర్టులే ఉంటాయి. ఈ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.
పాస్ పోర్టు రంగు మార్చాలనుకోవడం బీజేపీ వివక్షపూరిత చర్యలను సూచిస్తోందని ఆయన విమర్శించారు. విదేశాలకు వెళ్లే కార్మికులను రెండో తరగతి ప్రయాణికుల్లా చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 10వ తరగతి పాస్ కాని వారికి ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ పాస్ పోర్టులను మంజూరు చేస్తారు. ఇలాంటివారు విదేశాలకు వెళ్లకముందే ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.