Virat Kohli: కోహ్లీ వన్ మ్యాన్ షో.. టీమిండియా ఆలౌట్
- 153 రన్స్ చేసి ఔటైన కోహ్లీ
- 307 పరుగులకు టీమిండియా ఆలౌట్
- నాలుగు వికెట్లు తీసిన మోర్కెల్
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వరుసగా వికెట్లు నేలకూలుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 217 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 15 ఫోర్ల సాయంతో 153 పరుగులు చేసి, చివరి వికెట్ గా వెనుదిరిగాడు. కోహ్లీ ప్రతిభతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులకు ఆలౌటైంది. దీంతో, దక్షిణాఫ్రికా కన్నా తొలి ఇన్నింగ్స్ లో 28 పరుగులు వెనుకబడి ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా స్కోరు 335 పరుగులు.
ఇతర భారత బ్యాట్స్ మెన్ లో మురళీ విజయ్ 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివర్లో కోహ్లీకి అండగా నిలబడ్డ అశ్విన్ 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మిగిలిన వారిలో రాహుల్ 10, పుజారా డకౌట్, రోహిత్ శర్మ 10, పార్థివ్ పటేల్ 19, పాండ్యా 15, షమీ 1, ఇషాంత్ శర్మ 3 పరుగులు మాత్రమే చేశారు. బుమ్రా (0) నాటౌట్ గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో మోర్కెల్ నాలుగు వికెట్లు తీయగా... మహారాజ్, ఫిలాండర్, రబాడా, ఎన్గిడిలు చెరో వికెట్ తీశారు.