India: ఆయన చట్టరీత్యా పాక్ పౌరుడు.. కానీ, భారత్‌లోనే ఉంటానంటూ పట్టుబట్టి కూర్చున్న వైనం!
- పాకిస్థాన్ పౌరసత్వం ఉన్న ఉత్తరాఖండ్‌కు చెందిన నందకిశోర్
- చనిపోయేవరకు భారత్‌లోనే ఉంటానని పట్టు
- ఓ సారి బలవంతంగా పాక్‌కు పంపించిన అధికారులు
- మళ్లీ తిరిగి వచ్చిన వైనం
తాను ఓ భారతీయుడిగానే కన్నుమూస్తానని పాకిస్థాన్ పౌరసత్వం కలిగి ఉన్న ఉత్తరాఖండ్‌కు చెందిన నందకిశోర్ అలియాస్ హస్మత్ అలీ (80) పట్టుబట్టి మరీ కూర్చున్నారు. 1946వ సంవత్సరం (భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోకముందు)లో ఉత్తర ప్రదేశ్‌లోని దేవరియా ప్రాంతంలో హస్మత్ అలీ పుట్టారు. 8 ఏళ్ల వయసులో నందకిశోర్‌ను ఆయన తల్లి కరాచీకి పంపి ఒకరి ఇంట్లో పనిలో పెట్టారు. అక్కడి యజమాని అతని పేరును హస్మత్ అలీగా మార్చేశాడు. దీంతో దేశం విడిపోయాక నందకిశోర్ అలియాస్ హస్మత్ అలీకి పాక్‌లో పౌరసత్వం వచ్చింది.
తిరిగి 19 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పాస్పోర్టుతో, హస్మత్ పేరుతో ఆయన భారత్‌కి వచ్చారు. 1974 నుంచి ఏడాదికోసారి వీసా గడువును పొడగించుకుంటూ వస్తోన్న ఆయనకు 1998 నుంచి కష్టం వచ్చి పడింది. ఆ తరువాత వీసా గడువు పొడిగించేందుకు విదేశాంగ శాఖ ఒప్పుకోలేదు. పాక్‌కు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఓ సారి ఆయనను అట్టారీ సరిహద్దు వరకు పంపించారు. అయినప్పటికీ ఆయన అప్పటి విదేశాంగ మంత్రి చొరవతో మళ్లీ భారత్‌కు వచ్చేశారు.
2000 సంవత్సరంలో ఆయనను మరోసారి పాక్‌కు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆ తరువాత మానవతా దృక్పథం చూపిస్తూ మళ్లీ ఉండమన్నారు. 2008లో ఆయన విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయగా ఈ విషయంపై సంబంధిత అధికారులు పరిశీలన చేస్తున్నారు. భారత్‌లోనే తాను ఉంటానని, పాక్‌కు వెళ్లబోనని ఆయన కరాఖండీగా చెబుతున్నారు.