Boat: కృష్ణానదిలో తిరగబడిన పడవ.. తృటిలో తప్పిన ప్రమాదం
- అధిక బరువు కారణంగా బోల్తా పడిన పడవ
- తీరానికి సమీపంలోనే కావడంతో తప్పిన పెను ప్రమాదం
- సురక్షితంగా ఒడ్డుకు చేరిన ప్రయాణికులు
కృష్ణా నదిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పరిమితికి మించి ద్విచక్రవాహనాలను ఎక్కించుకున్న పడవ తీరాన్ని వీడగానే బోల్తాపడింది. అయితే నది ఒడ్డుకు కొద్ది దూరంలోనే ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రమాదం తప్పింది. నాగాయలంక వద్ద ఈ ఘటన జరిగింది. ఎదురుమొండి నుంచి ఏటిమొగ వెళ్తున్న పడవలో ఆరుగురు ప్రయాణికులతోపాటు మూడు ద్విచక్రవాహనాలను ఎక్కించారు. పడవ కొద్దిదూరం వెళ్లగానే ఒక్కసారిగా తిరగబడి అందులోని వాహనాలు, ప్రయాణికులు నీటిలో పడ్డారు. అయితే తీరం సమీపంలోనే ప్రమాదం జరగడంతో వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
ఈ మార్గంలో నిత్యం నడిచే పడవలను పోటీలకు తరలించడంతో పడవలు అందుబాటులో లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మరోమార్గం లేక నాటు పడవలను ఆశ్రయించారు. ప్రమాదానికి ఇదే కారణమని తెలుస్తోంది. పడవలు అందుబాటులో లేకపోవడంతో ఒకే పడవలో మూడు ద్విచక్ర వాహనాలు, ఇతర సామగ్రిని ఎక్కించారు. దీంతో బరువుకు పడవ ఒక పక్కకు ఒరిగిపోయి తిరగబడింది.