Petrol: రికార్డు స్థాయికి 'పెట్రో' ధరలు... సామాన్యునిపై తీవ్ర ప్రభావం!
- 2014 తరువాత గరిష్ఠానికి పెట్రోలు, డీజిల్ ధరలు
- హైదరాబాద్ లో రూ. 75 దాటిన లీటరు పెట్రోలు ధర
- రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాలని డిమాండ్
ఇంటర్నేషనల్ క్రూడాయిల్ మార్కెట్ లో ధరల ర్యాలీ కొనసాగుతూ ఉండటంతో, ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన నెల రోజుల వ్యవధిలో పెట్రోలు ధర రూ. 2 కు పైగా, డీజిల్ ధర రూ. 3.50 వరకూ పెరిగాయి. మంగళవారం నాడు ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 71.27కు చేరగా, హైదరాబాద్ లో ధర రూ. 75.47కు చేరింది.
2014 తరువాత పెట్రోలు ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఇక డీజిల్ విషయానికి వస్తే, ఢిల్లీలో రూ. 61.74గా ఉన్న ధర ముంబైలో ఏకంగా రూ. 65.74కు చేరింది. హైదరాబాద్ లో రూ.67.23కు పెరిగింది. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు స్థానిక పన్నులను ఎక్కువగా వసూలు చేస్తుండటమే ఇందుకు కారణం. 'పెట్రో' ఉత్పత్తుల ధరలను తగ్గించే దిశగా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా, వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను తగ్గించడంలో రాష్ట్రాలు ఆసక్తిని చూపడం లేదు. తమకు లభించే ఆదాయానికి గండి పడుతుందన్నది వారి ఉద్దేశం. దీంతోనే వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయని, వెంటనే పన్నుల భారాన్ని తగ్గించి, 'పెట్రో' కస్టమర్లను ఆదుకోవాలన్న డిమాండ్ నానాటికీ పెరుగుతోంది.