Selfi: ముస్లిం యువకుడితో సెల్ఫీ దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్త... చంపేస్తామని బెదిరింపు!
- రైల్లో ప్రయాణిస్తూ ముస్లిం యువకుడితో యువతి సెల్ఫీ
- బెదిరింపులతో ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటక ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)కు చెందిన ఓ యువ మహిళా కార్యకర్త, రైలులో ముస్లిం యువకుడితో తీసుకున్న సెల్ఫీ, ఇప్పుడామె ప్రాణాలకు ప్రమాదాన్ని తీసుకొచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తన స్నేహితుడితో కలిసి మాధురి అనే యువతి రైల్లో ప్రయాణిస్తున్న వేళ, ఓ సెల్ఫీ తీసుకుని తన ఫేస్ బుక్ ఖాతాలో అప్ లోడ్ చేసింది. దీన్ని చూసిన బెళ్తంగడి సమీపంలోని కక్కిరిచి ప్రాంతానికి జెందిన హరీశ్ దేవాడిగ అనే వ్యక్తి, ఆమెను బెదిరిస్తూ, మెసేజ్ లు పెట్టాడు.
ఓ ముస్లింతో ఫోటో దిగుతావా? చంపేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో మాధురి ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు, హరీశ్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇటీవల 'ఐ లవ్ ముస్లిమ్స్' అని మెసేజ్ పెట్టిన ఓ 20 ఏళ్ల యువతిని వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఘటన కర్ణాటకలో జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు, వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు.