Banzir Bhutto: మిస్టరీ వీడింది: బెనజీర్ భుట్టోను చంపింది తామేనని వెల్లడించిన ఉగ్ర సంస్థ!
- పుస్తకం రాసిన తాలిబాన్ నేత అబూ మన్సూర్ అసిమ్ ముఫ్తీ
- బెనజీర్ ను హత్య చేసిన తెహ్రిక్ తాలిబన్
- గతంలో లాడెన్, ముషారఫ్‌పై ఆరోపణలు
- తాలిబన్ నేతల అకృత్యాలను కళ్లకు కట్టిన పుస్తకం
పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను ఎవరు చంపారు? లాడెన్ చంపించాడని ఒకరు.. మాజీ డిక్టేటర్ ముషారఫ్ హత్య చేయించాడని మరొకరు ఆరోపణలు చేస్తున్నా.. ఇప్పటి వరకు ఈ విషయంలో స్పష్టత లేదు. ముషారఫ్ కంటే లాడెన్పైనే ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. ఇందుకు బలం చేకూర్చే పలు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. అయితే ఇన్నాళ్లకు బెనజీర్ను చంపింది ఎవరన్న విషయాన్ని ఓ పుస్తకం ప్రపంచానికి వెల్లడించింది.
తాలిబాన్ నేత అబూ మన్సూర్ అసిమ్ ముఫ్తీ రాసిన ‘ఇంక్విలాబ్ మెహ్సూద్ సౌత్ వజీరిస్థాన్’ అనే పుస్తకంలో బెనజీర్ హత్యకు సంబంధించి ఆసక్తికర విషయాలు రాశారు. ఆమెను చంపింది తెహ్రిక్ తాలిబన్ అనే ఉగ్ర సంస్థ అని పుస్తకంలో పేర్కొన్నారు. గతేడాది నవంబరు 30న ఈ పుస్తకాన్ని ప్రచురించగా తాజాగా ఆదివారం దీనిని విడుదల చేశారు. తాలిబన్ నేతలు చేసిన పలు అకృత్యాలను ఈ పుస్తకంలో వివరించారు.
మాజీ ప్రధాని బెనజీర్ ను బిలాల్ అలియాస్ సయీద్, ఇక్రముల్లా అనే ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు హత్య చేసినట్టు పుస్తకంలో పేర్కొన్నారు. తొలుత బిలాల్ మాజీ ప్రధాని మెడపై కాల్చి ఆ వెంటనే తనను తాను పేల్చేసుకున్నాడు. ఇక్రముల్లా తప్పించుకున్నట్టు పుస్తకంలో వివరించారు. దీంతో ఇన్నాళ్లకు బెనజీర్ హత్యపై స్పష్టత వచ్చింది.
నిజానికి బెనజీర్ పై హత్యాయత్నం జరగబోతోందంటూ నిఘా వర్గాలు పాక్ హోంశాఖను ముందే హెచ్చరించాయి. బెనజీర్, ముషారఫ్, జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం ఫజల్ చీఫ్ ఫజ్లర్ రహహాన్‌ను చంపేందుకు లాడెన్ అనుచరులు ప్లాన్ చేస్తున్నట్టు హెచ్చరికలు జారీ చేశాయి. వీరి హత్యను పర్యవేక్షించేందుకు లాడెన్ ఆఫ్ఘనిస్థాన్ వెళ్లినట్టు పేర్కొన్నాయి. లాడెన్ పేరుతో కొరియర్లో పేలుడు పదార్థాలు వచ్చాయని అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని హెచ్చరించాయి.
నిఘా వర్గాల హెచ్చరికలను అప్పటి ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఫలితంగా జరిగిన బాంబుదాడిలో బెనజీర్ మరణించారు. ఆ తర్వాత ఆమె చనిపోయినట్టు నిర్ధారిస్తూ లాడెన్‌కు రాసిన లేఖను అధికారులు ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు బెనజీర్ మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. ఎవరు చంపారన్న విషయంలో ఇప్పటికీ మిస్టరీ కొనసాగుతుండగా తాజా పుస్తకం అనుమానాలను పటాపంచలు చేస్తూ బెనజీర్ ను చంపింది తామేనని తెహ్రిక్ తాలిబన్ సంస్థే వెల్లడించింది.