Telangana: ఉన్నతాధికారులను కీలక సమావేశానికి పిలిచిన కేసీఆర్!
- నేటి ఉదయం 11 గంటలకు సమావేశం
- ప్రగతి భవన్ కు రానున్న కలెక్టర్లు, అధికారులు
- వివిధ సంక్షేమ పథకాలపై సమీక్ష
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో కలెక్టర్లు, ఉన్నతాధికారులను కీలక సమావేశానికి పిలిచారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్న కేసీఆర్, ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ తదితర అంశాలపై పురోగతిని ఆయన అడిగి తెలుసుకోనున్నట్టు సమాచారం.
వివిధ శాఖల అధిపతులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పంచాయితీ ఆఫీసర్స్ సైతం ఈ సమావేశంలో పాల్గొనాలన్న ఆదేశాలు వెళ్లాయి. ఈ సమావేశంలో కొత్త పంచాయితీ రాజ్ చట్టం అమలైన తరువాత సర్పంచులకు, పాలక మండళ్లకు ఇవ్వాల్సిన అధికారాలు, బాధ్యతలను చర్చించనున్నారని తెలుస్తోంది. ఆపై వందలాది గూడేలను పంచాయతీలుగా మార్చే అంశంపైనా కేసీఆర్ సమీక్షించనున్నారు. కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు భూ సేకరణ, మిషన్ భగీరథ సాగుతున్న తీరు, రెవెన్యూ అంశాలు, బడ్జెట్ కేటాయింపులపై వివిధ ప్రాంతాల అధికారుల అభిప్రాయాలను ఆయన తెలుసుకోనున్నారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.