Mitech city: హైదరాబాద్‌కు హైటెక్ సిటీ.. మంగళగిరికి మైటెక్ సిటీ.. నేడు 16 ఐటీ కంపెనీలు ప్రారంభం
- మంగళగిరిలో నేడు ఐటీ కంపెనీలను ప్రారంభించనున్న లోకేశ్
- ఉద్యోగులకు రక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు
- గుంటూరులో వేద ఐఐటీ
- శరవేగంగా అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం
యువతకు ఉద్యోగ కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నిస్తున్నాయి. రాజధాని ప్రాంతం మంగళగిరిని మైటెక్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఐటీ మంత్రి లోకేశ్ నేడు (బుధవారం) 16 ఐటీ కంపెనీలను ప్రారంభించనున్నారు. ఈ కంపెనీల ద్వారా ఇప్పటికిప్పుడు 600 మందికి ఉపాధి అవకాశాలు లభించనుండగా ఏడాదిలోపు మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మంగళగిరి ఆటోనగర్ ప్రాంతంలో ఇప్పటికే మూడు ఐటీ కంపెనీలు పనిచేస్తుండగా వీటిలో 500 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరో 16 కంపెనీలు ప్రారంభం కానుండడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది.
ఐటీ కంపెనీల ఏర్పాటుతోనే చేతులు దులిపేసుకోకుండా ఉద్యోగుల రక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం నడుంబిగించింది. ఉద్యోగులు వేగంగా, సురక్షితంగా కార్యాలయాలకు చేరేందుకు ఆర్టీసీతో కలిసి ఐటీ పార్కు వద్ద ప్రత్యేకంగా ఓ బస్టాప్ ఏర్పాటు చేయించింది. విజయవాడ నుంచి ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు. అలాగే ఉద్యోగుల రక్షణ కోసం పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. ఐటీ సంస్థల్లో శిక్షణ కోసం రాష్ట్రం నలుచెరగుల నుంచి వచ్చే వారికి అపార్ట్‌మెంట్లలో హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గుంటూరు విద్యానగర్‌లో ఐటీలో పరిశోధన కోసం ‘వేద ఐఐటీ’ అనే సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఐటీ సంస్థలకు అనుబంధంగా గన్నవరంలోని మేధా టవర్స్‌లో స్టేట్ సాఫ్ట్ ఫైనాన్స్ కామర్స్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థ ఇప్పటికే 250 మంది కామర్స్ పట్టభద్రులకు శిక్షణ ఇస్తోంది. అలాగే మంగళగిరిలో నిర్వహిస్తున్న వర్క్ షాపునకు 2 వేల మంది విద్యార్థులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఐటీ అభివృద్ది, శిక్షణ, ఉపాధి అవకాశాలపై మంత్రి లోకేశ్ విద్యార్థులకు వివరించనున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీలా మంగళగిరిలోని ఐటీ ప్రాంతం మైటెక్ సిటీగా అభివృద్ధి చెందుతుందని ఏపీ ఎన్‌ఆర్‌టీ సీఈవో రవి వేమూరి తెలిపారు.