Hike: హైక్ వినియోగదారులకు శుభవార్త.. ఇంటర్నెట్ లేకున్నా ‘అన్నీ’ చేసేసుకోవచ్చు!
- ఖాతాదారులను ఆకర్షించేందుకు ‘టోటల్’ను తీసుకొచ్చిన హైక్
- ఇక ఇంటర్నెట్ లేకుండానే అన్ని పనులు
- వినియోగదారుల సంఖ్యను 10 కోట్లకు పెంచుకోవడమే లక్ష్యం
దేశీయ మెసేజింగ్ యాప్ ‘హైక్’ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై ఇంటర్నెట్ లేకున్నా చాట్ చేసుకోవడం, వార్తలు చదవడం, నగదు బదిలీ, రైలు టికెట్ల బుకింగ్, జ్యోతిష్యం వంటి వాటిని చేసుకునేందుకు వీలుగా కొత్తగా ‘టోటల్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఎయిర్సెల్, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ‘టోటల్’ కోసం 20 ఎంబీ డేటా కేవలం రూపాయికే లభిస్తుందని పేర్కొంది. జీఎస్ఎం ఫోన్లలో ఉండే యూఎస్ఎస్డీ సాంకేతికత (121%)నే టోటల్ కోసం ఉపయోగించుకున్నట్టు హైక్ మెసెంజర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కావిన్ మిట్టల్ తెలిపారు.
ఇంటెక్స్, కార్బన్ వంటి దేశీయ తయారీ ఫోన్లలో టోటల్ యాప్ను ముందస్తుగానే లోడ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఫోన్లలోని టోటల్ యాప్లో సైన్ చేయగానే హైక్ వాలెట్లో రూ.200 జమ అవుతుందని తెలిపారు. ఈ సొమ్ముతో డేటాను కొనుక్కోవచ్చని, స్నేహితులకు పంపుకోవచ్చని వివరించారు. వాట్సాప్కు పోటీగా వచ్చిన హైక్ తన వినియోగదారులను 10 కోట్లకు పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది.