amanda: ఇదో వింత.. 300 ఏళ్ల నాటి ఆత్మను పెళ్లి చేసుకున్న ఐరిష్ మహిళ!
- నిజజీవితంలో ప్రేమించే వాళ్లు దొరక్క ఈ పని
- సముద్రపుదొంగతో సంప్రదాయ వివాహం
- సముద్రం మీదే పెళ్లి చేసుకున్న అమాండ టీగూ
ఐర్లాండ్‌కి చెందిన అమాండ టీగూకి నిజజీవితంలో స్వచ్ఛమైన ప్రేమను అందించే మగాడు దొరకలేదట. అందుకే 300 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ ఆత్మను పెళ్లిచేసుకుంది. ఆ ఆత్మ పేరు జాక్. ఓ సముద్రపు దొంగ. ఉత్తర ఐర్లాండ్ సముద్ర తీరంలో 12 మంది బంధువుల సమక్షంలో జాక్, అమాండాలు ఒక్కటయ్యారు. అక్కడి చట్టాల ప్రకారం వీరి పెళ్లి చట్టబద్ధమే.
సముద్రం మీద ఓ బోటులో పుర్రె, ఎముక గుర్తు ఉన్న జెండా రూపంలో ఉన్న జాక్, పెళ్లి కూతురు దుస్తుల్లో మెరిసిపోతున్న అమాండాలకు ఓ మతాధికారి పెళ్లి చేశారు. జాక్ భౌతికంగా లేడు కాబట్టి ఓ కొవ్వొత్తికి ఉంగరాన్ని తొడిగి అమాండ సంతృప్తిపడింది. 2014లో ఓ రోజు రాత్రి వాళ్లిద్దరి మధ్యా ప్రేమ చిగురించిందని, జాక్ ఎప్పుడూ తన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుందని అమాండ చెబుతోంది. కాగా, అమాండాకి ఇప్పటికే పెళ్లై ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విడిపోయిన తర్వాత నిజజీవితంలో గొప్పగా ప్రేమించేవాళ్లు ఎవరూ దొరకలేదని, కానీ జాక్ రూపంలో తనకు స్వచ్ఛమైన ప్రేమ లభించిందని అమాండా అంటోంది.