china: హానికర పొగమంచుకు చైనా చెక్.. వాయు శుద్ధి పనికరం ఏర్పాటు!
- 328 అడుగుల ఎత్తున్న వాయు శుద్ధి కేంద్రం ఏర్పాటు
- 10 కి.మీ. పరిధిలో వాయు నాణ్యతను పెంచుతుంది
- రోజుకు 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల వాయువుల శుద్ధి
ఆర్థికంగా దూసుకుపోతున్న చైనా... వాతావరణ కాలుష్యం విషయంలో కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. దీనికి తోడు అత్యంత హానికరమైన పొగమంచు ఆ దేశానికి పెద్ద సవాల్ గా పరిణమించింది. దీనిపై యుద్ధం ప్రకటించిన చైనా... ప్రపంచంలోనే అతి పెద్ద వాయు శుద్ధి పరికరాన్ని నిర్మించింది. స్థూపాకారంలో ఉండే ఈ నిర్మాణం ఏకంగా 328 అడుగుల ఎత్తు ఉంది. ఈ నిర్మాణం 10 కిలోమీటర్ల పరిధిలో వాయు నాణ్యతను పెంచుతుందని చైనీస్ సైన్స్ అకాడమీ నిపుణులు తెలిపారు.
పొగమంచులో ఉండే హానికరమైన పీఎం 2.5 సహా ఇతర సూక్ష్మ రేణువులను 15 శాతం తగ్గిస్తుందని చెప్పారు. పొగమంచుకు కారణమయ్యే నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువులను ఇది శుధ్ధి చేస్తుందని తెలిపారు. రోజుకు 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల వాయువులను ఇది శుద్ధి చేస్తోందని పరీక్షల్లో తేలిందని వెల్లడించారు.