whatsapp: వచ్చేనెల నుంచి వాట్సాప్ ద్వారా డబ్బు చెల్లింపులు
- యూపీఐ చెల్లింపుల కోసం బ్యాంకులతో ఒప్పందం
- ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న సదుపాయం
- ఊపందుకోనున్న పేమెంట్స్
త్వరలో డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు గతంలో వాట్సాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన సన్నాహాలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ సదుపాయాన్ని ఫిబ్రవరి నెలాఖరులోగా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే యూపీఐ చెల్లింపుల కోసం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతో ఒప్పందాలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. డేటా భద్రతపై బ్యాంకులు సెక్యూరిటీ చెక్స్ నిర్వహిస్తున్నాయని, ఇంటిగ్రేషన్ ప్రక్రియలో భాగంగా ఈ సదుపాయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ముందు ఎంపిక చేసిన యూజర్లతో దీన్ని పరీక్షిస్తామని ఓ బ్యాంక్ ప్రతినిధి చెప్పారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే దేశంలో డిజిటల్ చెల్లింపులు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.