Vangaveeti Radha: జగన్ కు దూరమవుతున్నారా? అని వంగవీటి రాధను అడిగితే... సమాధానం ఇది!
- వైకాపాలో రాధ అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు
- త్వరలో పార్టీ మారుతారని అంచనా
- దేనికైనా సమయం రావాలని వ్యాఖ్యానించిన రాధ
- చిన్న చిన్న పదవులను ఆశించి పార్టీ మారబోనని స్పష్టీకరణ
వైకాపాలో అసంతృప్తిగా ఉన్న విజయవాడ నేత వంగవీటి రాధ, టీడీపీలో చేరనున్నారని వచ్చిన వార్తలు నిన్న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, ఈ విషయమై రాధ స్పందించారు. వైకాపాను వీడటం లేదని స్వయంగా ఎందుకు చెప్పడం లేదన్న ప్రశ్నకు, దేనికైనా సమయం రావాల్సి ఉందని నర్మగర్భ సమాధానం ఇచ్చారు. తన పని తాను చేసుకు వెళుతున్నానని, పార్టీ మారాలని భావిస్తే, పక్కా ప్రణాళికతోనే వెళ్తానని స్పష్టం చేశారు. తాను వెళ్లి పార్టీలో చేర్చుకోవాలని ఎవరితోనూ చర్చించలేదని రాధ చెప్పారు.
తనకు టీడీపీ నేతల్లో బంధువులు, స్నేహితులు ఉన్నారని, వారితో కలుస్తుంటానని చెప్పిన ఆయన, ప్రతి సంబంధాన్నీ రాజకీయాలతో ముడేయరాదని అన్నారు. చిన్న చిన్న పదవులు ఆశించి పార్టీ మారబోనని, ఎమ్మెల్యేగా పని చేసిన తనకు ఎమ్మెల్సీ ఎందుకని అన్నారు. వైకాపా నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అంగీకరించిన ఆయన, అలాగని పూర్తి దూరంగా ఏమీ లేనని, ఇటీవల నున్నలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యానని గుర్తు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి తనకు తెలుసునని, పార్టీ మారాలని భావిస్తే, కంగారుపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, అందరికీ చెప్పిన తరువాతే వెళతామని అన్నారు.