padmavat: 'పద్మావత్' విడుదలను ఆపేందుకు వీల్లేదు.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం!
- నిషేధాన్ని ఎత్తివేసిన అత్యున్నత న్యాయస్థానం
- నాలుగు రాష్ట్రాల్లో విడుదలకు సుప్రీం అనుమతి
- జనవరి 25న విడుదలకానున్న చిత్రం
'పద్మావత్' సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో సినిమా విడుదల నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నిర్మాతలకు ఊరట లభించింది. ఆ నాలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలపై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. శాంతి భద్రతల నెపంతో సినిమా విడుదలను ఆయా రాష్ట్రాలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని, ఆ కారణంతో సినిమా విడుదలను అడ్డుకోవడం సబబు కాదని తేల్చిచెప్పింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదట్నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. రాజ్పుత్ రాణుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా సినిమా ఉండబోతోందని కర్నిసేనలు, హిందూ వర్గాలు ఆందోళనలు చేశాయి. చివరికి చరిత్రకారుల సలహా మేరకు కొన్ని మార్పులు చేసి సినిమా విడుదలకు సీబీఎఫ్సీ అంగీకరించింది. అయినప్పటికీ శాంతి భద్రతల దృష్ట్యా బీజేపీ పాలిత రాష్ట్రాలు సినిమా విడుదలను నిషేధించాయి.