India: రూ. 6 లక్షలకన్నా విలువైన నగలు కొన్నారా?: కేంద్రం ఓ కన్నేసింది జాగ్రత్త!
- నల్లధన చలామణిని అరికట్టేందుకు ప్రణాళిక
- విలువైన కొనుగోళ్లపై విచారించనున్న ఐటీ శాఖ
- భాగం కానున్న రెవెన్యూ, ఇంటెలిజెన్స్ ఏజన్సీలు
నల్లధనం చలామణిని, మనీలాండరింగ్ ను అరికట్టేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా రూ. 6 లక్షలకు పైగా విలువైన నగలు లేదా విలాస వస్తువులను కొనుగోలు చేస్తే, ఆ లావాదేవీలను విచారించాలని ఆదాయపు పన్ను శాఖతో పాటు రెవెన్యూ, ఇంటెలిజెన్స్ ఏజన్సీలను కేంద్రం ఆదేశించింది. ఈ తరహా లావాదేవీలను పరిశీలించాలని, అవకతవకలు కనిపిస్తే, కేసులు పెట్టి విచారించాలని కేంద్ర నిఘా విభాగాల అధికారులకు ఆదేశాలు అందాయి.
బినామీ లావాదేవీలు నిర్వహిస్తూ, అక్రమంగా డబ్బు చలామణి చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన కేంద్రం, నగదు లావాదేవీలు రూ. 2 లక్షలకు మించరాదని, రూ. 50 వేలకు పైగా జరిపే లావాదేవీలకు పాన్ నంబరు తప్పనిసరని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ. 6 లక్షలకు మించిన అన్ని కొనుగోళ్లనూ పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఇక రూ. 50 లక్షలకు పైగా జరిపిన ఆస్తుల కొనుగోళ్లను కూడా ఐటీ శాఖ పరిశీలించనుంది.