Arminder Singh: పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఒక్క భారత జవాను తలకు పదిమంది పాక్ జవాన్ల తలలు తేవాలన్న సీఎం!
- పాక్ కాల్పుల్లో తమిళనాడుకు చెందిన జవాను మృతి
- దాయాది తీరుపై హోంమంత్రిత్వ శాఖ ఆగ్రహం
- తీరు మార్చుకోకుంటే భారీ మూల్యం తప్పదని హెచ్చరిక
పాక్ కాల్పుల్లో అమరులైన ఒక్కో జవానుకు ప్రతిగా పదిమంది పాక్ సైనికులను చంపాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. తాజాగా పాక్ కాల్పుల్లో తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ సురేష్ అమరుడయ్యాడు. ఆయనకు భార్య, 13 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల బాబు ఉన్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మన జవాను ఒక్కరు చనిపోతే, పదిమంది పాక్ సైనికులను చంపాల్సిందే. నేను ఇదే చూడాలనుకుంటున్నా’’ అన్నారు ఆవేశంగా. కాగా, పాక్ తీరుపై హోంమంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ స్వభావంలో ఏమాత్రం మార్పురావడం లేదని సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇదే పంథాను కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్ము జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు 5 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న పాఠశాలలను మూసివేశారు.