Call Drop: కాల్ డ్రాప్ లపై కుంటి సాకులు చెబుతున్న టెల్కోలకు కేంద్రం హెచ్చరిక!
- కాల్ డ్రాప్ సమస్యపై పెరుగుతున్న ఫిర్యాదులు
- సమస్య కొనసాగరాదని హెచ్చరించిన డాట్
- సెల్ ఫోన్ సేవల నాణ్యత పెరగాల్సిందే
- డాట్ సెక్రటరీ అరుణా సుందరరాజన్
సెల్ ఫోన్లలో మాట్లాడుతుండగా, కాల్ డ్రాపింగ్ సమస్య ఎక్కువగా ఉంటోందని ఫిర్యాదులు పెరుగుతున్న వేళ, సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాల్సిందేనని టెలికం కంపెనీలకు కేంద్రం తెగేసి చెప్పింది. మొబైల్ టవర్లలో సమస్యలు ఉన్నాయనో, పీక్ అవర్స్ అనో కుంటి సాకులు చెబితే ఊరుకోబోయేది లేదని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (డాట్) సెక్రటరీ అరుణా సుందరరాజన్ హెచ్చరించారు. కాల్ డ్రాప్ సమస్య కొనసాగరాదని, సరైన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె అన్నారు.
మొబైల్ సర్వీసుల నాణ్యతపై ట్రాయ్ నియమించిన కమిటీ నివేదిక రాగానే కాల్ డ్రాప్ పై టెలికం సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయనున్నామని అన్నారు. మొబైల్ టవర్ల ఏర్పాటుకు ప్రజల నుంచి కొన్ని చోట్ల వ్యతిరేకత వస్తోందన్న సాకులు చెప్పి తప్పించుకోరాదని ఆమె స్పష్టం చేశారు. మౌలిక వసతులు మెరుగు పరచుకునే దిశగా టెలికం సంస్థలు మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కాగా, సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించని టెలికం సంస్థలపై రూ. 10 లక్షల వరకూ జరిమానా విధించాలని డాట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.