harman preet kaur: హర్మన్ ప్రీత్ కౌర్కి ఉద్యోగ మార్పిడి కష్టాలు... రిలీవ్ చేయడానికి రూ. 27 లక్షలు డిమాండ్ చేస్తున్న పశ్చిమ రైల్వే!
- డీఎస్పీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్న హర్మన్
- రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్న పశ్చిమ రైల్వే
- బాండ్ పూర్తి కానందున రూ. 27 లక్షలు చెల్లించాలని డిమాండ్
మహిళ ప్రపంచకప్ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారత ఖ్యాతిని నిలిపిన క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్కి ఉద్యోగ మార్పిడి కష్టాలు వచ్చాయి. ఆమె ప్రతిభకు గాను పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఉద్యోగంలో చేరాలనుకుంటున్న హర్మన్కి తాను పశ్చిమ రైల్వేలో చేస్తున్న ఆఫీస్ సూపరింటెండెంట్ ఉద్యోగం అడ్డంకిగా నిలిచింది.
మూడేళ్ల క్రితం హర్మన్ ఈ ఉద్యోగంలో చేరింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ నిబంధనల ప్రకారం ఐదేళ్ల వరకు పనిచేస్తానని హర్మన్ ఒప్పంద పత్రం మీద సంతకం చేసింది. ఒకవేళ ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఐదేళ్ల జీతాన్ని తిరిగి ఇవ్వాలని అందులో షరతు ఉంది. ఈ కారణంగా హర్మన్ రాజీనామాను పశ్చిమ రైల్వే అంగీకరించడం లేదు. అంతేకాకుండా ఐదేళ్ల జీతంగా రూ. 27 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
ఈ విషయమై హర్మన్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తనకు గత ఐదు నెలలుగా జీతం రావడం లేదని, తనకు మూడేళ్ల పాటు జీతం ఇచ్చి, ఇప్పుడు ఐదేళ్ల జీతాన్ని చెల్లించమనడం సబబుకాదని అంది. ఈ సమస్యపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాసినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని హర్మన్ వాపోయింది.