facebook: ఫేస్‌బుక్ రక్తదానం ఫీచర్‌కి విపరీత ఆదరణ... రిజిస్టర్ చేసుకున్న 60 లక్షల మంది భారతీయులు
- దేశంలోనే అతిపెద్ద రక్తదాతల డేటాగా ఫేస్‌బుక్
- అక్టోబర్ 2017లో ప్రారంభమైన ఫీచర్
- 250కి పైగా రక్తదాన శిబిరాల నిర్వహణ
గత అక్టోబర్‌లో ఫేస్‌బుక్ ప్రారంభించిన బ్లడ్ డొనేషన్ ఫీచర్‌కి భారతదేశంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 60 లక్షల మంది రక్తదాతలుగా తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోనే అతిపెద్ద రక్తదాతల డేటా ఉన్న ఆన్‌లైన్ కేంద్రంగా ఫేస్‌బుక్ నిలిచింది. కమ్యూనిటీల మధ్య సమన్వయం కోసం, అత్యవసర సమయాల్లో సహాయాన్ని అందించడానికి తాము ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఫేస్‌బుక్ ప్రతినిధి హేమ బూదరాజు తెలిపారు.
ఈ రక్తదానాల ఫీచర్ గురించి అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్‌తో కలిసి దాదాపు 250కి పైగా రక్తదాన శిబిరాలను ఫేస్‌బుక్ నిర్వహించింది. అలాగే దేశంలో చాలా ఆసుపత్రులతో కూడా ఫేస్‌బుక్ ఒప్పందం చేసుకుని రక్తదానం అవగాహన శిబిరాలను నిర్వహిస్తోందని హేమ బూదరాజు వెల్లడించారు. రక్తం కావాల్సిన వారు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే చాలు.. దగ్గరలో ఉన్న రక్తదాతలకు నోటిఫికేషన్ వెళ్తుంది. దీంతో వారు సరైన సమయానికి హాజరై రక్తదానం చేసే సదుపాయం కలుగుతుంది.