padmavat movie: అదొక అశ్లీల చిత్రం.. ముస్లింలు ఎవరూ దాన్ని చూడొద్దు: అసదుద్దీన్ ఒవైసీ
- 'పద్మావత్' చిత్రంపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
- అదొక కట్టు కథ
- ఆ సినిమా కోసం డబ్బు, సమయం వేస్ట్ చేసుకోవద్దు
వివాదాస్పద 'పద్మావత్' సినిమాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఒక కట్టు కథ అని... దాన్ని ముస్లింలు ఎవరూ చూడవద్దని సూచించారు. రాజ్ పుత్ రాణి పద్మావతి, రాజు అల్లావుద్దీన్ ఖిల్జీల కథ అంటూ ఈ సినిమా తీశారని... ఈ సినిమా కోసం డబ్బు, సమయాన్ని వృథా చేసుకోవద్దని చెప్పారు. పద్మావత్ లాంటి ఆశ్లీల చిత్రాన్ని చూడవద్దని... మంచి పనులు చేసి, మంచి జీవితం గడిపేందుకే దేవుడు మనల్ని పుట్టించాడని అన్నారు.
1540 నాటి చరిత్ర అంటూ ముస్లిం కవి మల్లిక్ మహ్మద్ రాసిన ఫిక్షన్ కథే ఇది అని తెలిపారు. ఈ సినిమాను అడ్డుకునేందుకు ప్రధాని మోదీ 12 మంది సభ్యులతో కమిటీని నియమించారని చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు.