ntr: ఎన్టీఆర్ కు, ఇప్పటి నటులకు తేడా అదే: తమ్మారెడ్డి భరద్వాజ
- ఎన్టీఆర్ కు ఆయన మీద ఆయనకు నమ్మకం ఉండేది
- ‘మనం చేసింది చూస్తారు బ్రదర్’ అని అనేవారు
- సినిమా కాన్వాసింగ్ ని నమ్ముకుంటున్న ఇప్పటి నటులు
- ‘నా ఆలోచన’లో తమ్మారెడ్డి
సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో పాత్రలు పోషించారని, ఇప్పటి నటులు ఇలాంటి పాత్రలు చేయగలరా? చేసే అవకాశం ఉందా? అంటూ ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ‘నా ఆలోచన’లో ఆయన మాట్లాడుతూ, మాస్ హీరో అయిన ఎన్టీఆర్, విభిన్న పాత్రల్లో నటించారని అన్నారు.
‘ఎన్టీఆర్ కు ఆయన మీద ఆయనకు నమ్మకం ఉండేది. ఆయన్ని ఆయన నమ్ముకునేవారు. ‘మనం చేసింది చూస్తారు బ్రదర్’ అని అనేవారు. అంటే, ఆయన మీద ఆయనకు నమ్మకం ఉన్నట్టు. ఆ రోజుల్లోని నటులకు, ఈరోజుల్లోని నటులకు అదే తేడా. ఇవాళ అట్లా లేదు. నటులు వాళ్లను వాళ్లు నమ్ముకోవడం కన్నా సినిమాకు చేస్తున్నకాన్వాసింగ్ ని నమ్ముకుంటున్నారు.
అప్పుడు, రామారావు, నాగేశ్వరరావు గారు వాళ్లను వాళ్లు నమ్ముకునేవారు. ప్రొడ్యూసర్లు వాళ్లను గౌరవించేవాళ్లు. వాళ్లతోనే సినిమాలు తీసేవాళ్లు. ఈరోజు ప్రొడ్యూసర్..క్యాషియర్ కూడా కాదు. ఇంకా బ్యాడ్ పరిస్థితికి వెళ్లిపోయింది. ఏ సినిమా తీస్తారో, కథేంటో, దర్శకుడు ఎవరో, నటీనటులెవరో ఇప్పటి ప్రొడ్యూసర్ కు తెలియని పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో నిర్మాతలకు ఎన్టీఆర్ ఎంతో గౌరవం ఇచ్చే వారు’ అని చెప్పుకొచ్చారు.