North Korea: ఉత్తరకొరియా సరిహద్దులో భారీగా భద్రతను పెంచుతోన్న చైనా.. రేడియేషన్ గుర్తించే పరికరాలు సైతం సిద్ధం
- ఉత్తరకొరియా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- ఉత్తరకొరియా, చైనా మధ్య 1,420 కిలోమీటర్ల మేర సరిహద్దు
- యుద్ధం జరిగితే తమకు నష్టం జరగకుండా చైనా చర్యలు
- సరిహద్దుల్లో సీసీ కెమెరాలు కూడా
ఉత్తరకొరియా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగి ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఉత్తరకొరియా నుంచి తమ దేశానికి కూడా ప్రమాదం ఉంటుందని అనుకుంటోన్న చైనా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తరకొరియాతో తమ దేశం 1,420 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోన్న నేపథ్యంలో క్షిపణులు తమ భూభాగాల్లో పడే అవకాశాలున్నాయని చైనా భావిస్తోంది.
అంతేకాదు, ఒకవేళ యుద్ధ పరిస్థితుల్లో ఉత్తరకొరియా నుంచి శరణార్థులు తరలివస్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా చైనా యోచిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో భద్రతను భారీగా పెంచడమే కాకుండా, సరిహద్దు వెంబడి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అణు పరీక్షల ద్వారా వెలువడే రేడియేషన్ను గుర్తించే పరికరాలను సిద్ధం చేసింది. ఉత్తరకొరియా ప్రజలతో సన్నిహితంగా ఉండకూడదని చైనా తమ ప్రజలకు చెబుతోంది.