Kathi Mahesh: 'ఎవరు కుట్ర చేశారు?'.. పవన్ అభిమానులకు జనసేన సూచనపై కత్తి మహేశ్ స్పందన
- నా మీద జరిగిన దాడికి అదే ప్రెస్ నోట్ లో ఖండిస్తున్నట్లు చిన్న ముక్క రాస్తే సరిపోయేది
- ఎందుకింత ఇగో?
- నా మీద దాడి జరిగినప్పటికీ కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు
- దాడి జరిగేంత వరకు ఇటువంటి ప్రకటన చేయాలని తెలియదా?
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని ఈ రోజు ఆ పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జనసేన చేసిన ప్రకటనపై కత్తి మహేశ్ స్పందించారు. 'నా మీద జరిగిన దాడికి అదే ప్రెస్ నోట్ లో ఖండిస్తున్నట్లు చిన్న ముక్క రాస్తే సరిపోయేది కదా? ఎందుకింత ఇగో? నా మీద దాడి జరిగినప్పటికీ కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ముందు చూపులేక మాట్లాడుతున్నారా?' అని ప్రశ్నించారు.
తన మీద దాడి జరిగేంత వరకు ఇటువంటి ప్రకటన చేయాలని తెలియదా? అని కత్తి మహేశ్ ప్రశ్నించారు. తన అభిమానుల వల్ల ఒకరికి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, ఇటువంటివి చేయొద్దని చెప్పేవాడే నిజమైన హీరో అని ఆయన అన్నారు. దాడులు చేయడం అప్రజాస్వామికమైనదని ఆ లేఖలో పేర్కొంటే సరిపోయేది కదా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తనకు క్షమాపణలు చెప్పేవరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు.
జనసేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయమని, ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ ఆ ప్రకటనలో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ... పార్టీ ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ విధి విధానాలు, మెంబర్ షిప్లు, కనీసం పార్టీ స్పోక్పర్సన్ కూడా లేరని కత్తి మహేష్ అన్నారు. నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ పసిపాపలు అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కుట్ర జరుగుతుందని అంటున్నారని, ఎవరు కుట్ర చేశారు? అని ప్రశ్నించారు. తప్పులు చేస్తూ, సమర్థత లేకుండా పార్టీని కొనసాగిస్తూ ఇతరుల కుట్ర అంటున్నారని విమర్శించారు.