Kathi Mahesh: మహేశ్ కత్తి సంచలన నిర్ణయం.. పవన్ అభిమానులపై కేసు ఉపసంహరణ!
- ఉదయం పెట్టిన కేసును సాయంత్రం ఉపసంహరించుకున్న ‘కత్తి’
- వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కేసును విత్ డ్రా చేసుకున్నట్టు ట్వీట్
- చర్చనీయాంశమైన కేసు ఉపసంహరణ
సినీ విమర్శకుడు మహేశ్ కత్తి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పవన్ అభిమానులపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నాడు. ఓ చానల్ సుదీర్ఘ సమయం పాటు నిర్వహించిన చర్చలో పాల్గొన్న కత్తి అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసును వెనక్కి తీసుకున్నాడు.
మహశ్ కత్తిపై కొందరు వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో శుక్రవారం ఆయన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనపై దాడి పవన్ అభిమానుల పనేనని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు. అయితే శుక్రవారం సాయంత్రం చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమం అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పవన్ అభిమానులపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నాడు.
అంతకుముందు ఏబిఎన్ లో జరిగిన చర్చాకార్యక్రమంలో వివాదాన్ని ఇంతటితో ఆపేయాలంటూ సినీ నిర్మాత రాంకీ మహేశ్ కత్తిని కోరారు. పవన్ లేఖ విడుదల చేశారు కాబట్టి ఇక పోరాటం ఆపేయాలని సూచించారు. అయితే, దాడి జరిగాక పవన్ లేఖను విడుదల చేశారు కాబట్టి ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. పవన్ నేరుగా క్షమాపణలు చెప్పేంత వరకు ఆపబోనని స్పష్టం చేశాడు.
అయితే, మహాటీవీలో డిబేట్ ముగిశాక నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసును ఉపసంహరించుకున్నాడు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కేసును విత్డ్రా చేసుకున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నాడు.