bill: ద్రవ్య వినిమయ బిల్లు తిరస్కరణ.. అమెరికా ప్రభుత్వం షట్డౌన్!
- ఆమోదం పొందని ద్రవ్య వినిమయ బిల్లు
- డెమోక్రాట్ల దెబ్బకు మూతపడిన ప్రభుత్వం
- ఫిబ్రవరి 16 వరకు మూతపడే అవకాశం
అమెరికా సెనేట్ లో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లులో డ్రీమర్ల భద్రతకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవీ లేవంటూ, డెమోక్రాట్లు వ్యతిరేకించడంతో నిర్ణీత గడువులో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఇవాళ అమెరికా ప్రభుత్వం మూతపడింది. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, యూఎస్ సెనేట్లో ఆమోదం పొందలేకపోయింది. ఆమోదం కోసం జనవరి 19 వరకు ఇచ్చిన గడువు పూర్తవడంతో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సమయంలోనే ఇలాంటి పరిస్థితి రావడం గమనార్హం.
ఈ కారణంగా ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వం మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి మరో 9 మంది డెమోక్రాట్ల మద్దతు అవసరం. అయితే మొదట్నుంచి ఈ బిల్లు విషయమై కొందరు రిపబ్లికన్లు కూడా డెమోక్రాట్లకు మద్దతిస్తుండటంతో ఆమోదం ప్రశ్నార్థకంగా మారింది. అందరూ ఊహించినట్లుగానే డెమోక్రాట్ల పంతం నెగ్గింది. ఈ విషయమై డెమోక్రటిక్ పార్టీ సెనేటర్తో ట్రంప్ చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో డెమోక్రాట్ల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ ఆరోపిస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు.
1981 నుంచి అమెరికాలో ఈ విధంగా ప్రభుత్వం మూతపడటం ఇది 12వ సారి. 2013లో కూడా 15 రోజులపాటు అగ్రరాజ్య ప్రభుత్వం మూతపడింది. షట్డౌన్ కారణంగా అమెరికా ప్రభుత్వానికి వారానికి రూ.42 వేల కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మూతపడటంతో ఉద్యోగులకు 40 రోజుల పాటు వేతనం లేని సెలవులు ప్రకటించారు.