Kabul: కాబూల్‌లో ఉగ్రవాదుల బీభత్సకాండ.. హోటల్లో విధ్వంసం.. అతిథుల హాహాకారాలు.. 35 మంది మృతి!
- ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్ కాంటినెంటల్ హోటల్లో ఉగ్రదాడి
- తుపాకులు, రాకెట్ ప్రొపెల్లడ్ గ్రనేడ్లతో విరుచుకుపడిన ముష్కరులు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం.. ఇంకా ముగ్గురు హోటల్లోనే..
ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. కాబూల్‌లోని లగ్జరీ హోటల్ ‘ఇంటర్ కాంటినెంటల్’లో శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించిన నలుగురు ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ ప్రొపెల్లడ్ గ్రనేడ్లతో దాడి చేశారు. హోటల్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో పలువురు మృతి చెందగా, మరి కొందరిని బందీలుగా పట్టుకున్నారు. హోటల్లోని కొన్ని ఫోర్లకు నిప్పు పెట్టారు. నాలుగో ఫ్లోర్లో ఉన్న కిచెన్ తగలబడింది.
హోటల్లోని అతిథులు ప్రాణభయంతో పరుగులు తీశారు. రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. కాల్పుల్లో 35 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యేక భద్రతా దళాలు హోటల్‌కు చేరుకుని ఎదురు కాల్పులు ప్రారంభించాయి.
వారి కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ముగ్గురు ఇంకా హోటల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నట్టు ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత భద్రతాశాఖ అధికార ప్రతినిధి నజబ్ డానిష్ తెలిపారు. ఉగ్రవాదులు హోటల్లోకి ప్రవేశించిన రెండు గంటల తర్వాత కూడా కాల్పుల శబ్దం వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉగ్రవాదులు హోటల్లోకి ఎలా ప్రవేశించారో తెలియదు కానీ, అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపినట్టు ప్రాణాలతో బయటపడిన మేనేజర్ అహ్మద్ హారిస్ నయాబ్ తెలిపారు.
‘ఇంటర్ కాంటినెంటల్’ హోటల్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అత్యాధునిక హంగులతో ఉండే ఈ హోటల్ ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. కాబూల్‌లోని రెండు ప్రముఖ హోటళ్లలో ఇదొకటి. ఆఫ్ఘాన్లోనే అతిపెద్దది. 1969లో ప్రభుత్వమే ఈ హోటల్‌ను ప్రారంభించింది. ఇందులో 200 గదులు, నాలుగు రెస్టారెంట్లు ఉన్నాయి. విదేశీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వీవీఐపీలు బస చేసే ఈ హోటల్‌కు ఎప్పుడూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. 2011లో ఈ హోటల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది మరణించారు. తాజా ఘటనలో మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉంది. ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు.