c ramachandraiah: ఏపీలో బీజేపీ రెండుగా చీలడానికి చంద్రబాబే కారణం: సి.రామచంద్రయ్య
- గవర్నర్ ను మార్చాలంటూ కొందరు బీజేపీ నేతల డిమాండ్
- వారి లేఖల వెనుక ఉన్నది చంద్రబాబే అన్న రామచంద్రయ్య
- బాబు వల్ల బీజేపీ రెండుగా చీలిపోయింది
ఏపీలో బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందని... దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు అక్రమాల గురించి కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ చెప్పారని... దీంతో, గవర్నర్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలతో కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయించారని అన్నారు. తనకు అనుకూలంగా ఉండే బీజేపీ నేతలలో లేఖ రాయించారని చెప్పారు.
సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని రామచంద్రయ్య మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నందునే కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుపడుతున్నది కూడా చంద్రబాబేనని అన్నారు.
గవర్నర్ నరసింహన్ ను మార్చాలంటూ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు, బడ్జెట్ సమావేశాల్లోగా ఏపీకి కొత్త గవర్నర్ రావాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే, సి.రామచంద్రయ్య పైవ్యాఖ్యలు చేశారు.