Pawan Kalyan: వీలైతే పాదయాత్ర, లేకపోతే రోడ్ షో... పవన్ కల్యాణ్ యాత్ర వివరాలు ఇవే!
- కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభం
- నాలుగు రోజుల్లో మూడు జిల్లాల పర్యటన
- ఎక్కడికక్కడ కార్యకర్తలతో సమావేశాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్ర వివరాలను ప్రకటించారు. రేపట్నుంచి తెలంగాణలో యాత్ర ప్రారంభమవుతుంది. తొలుత నాలుగు రోజులపాటు తెలంగాణలోని మూడు జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ తెలిపారు. 2009లో జరిగిన ప్రమాదం నుంచి తనను ఆంజనేయస్వామే కాపాడాడని... అందువల్ల రేపు తొలుత కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని... అక్కడ నుంచి యాత్రను ప్రారంభిస్తానని చెప్పారు.
మూడు, నాలుగు జిల్లాల నేతలతో సమావేశమైన తర్వాత కొండగట్టులో తన యాత్ర పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. వీలైతే పాదయాత్..ర లేకపోతే బస్సుయాత్ర.. అవసరమైతే రోడ్ షో.. ఇలా వీలున్న మార్గాల్లో ప్రజల చెంతకు వెళతానని చెప్పారు. ప్రత్యేకించి విరామం అనేది ఉండదని తెలిపారు. ప్రజాసమస్యలను అధ్యయనం చేయడానికే ఈ యాత్రను చేపడుతున్నానని చెప్పారు. పాదయాత్ర చేస్తే ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉండదని తెలిపారు. యాత్రలో భాగంగా ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు.